అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి, ఓ నా దాసులారా! ఎవరికైతే నేను మార్గదర్శకత్వం చేసినానో, వారు తప్ప మిగిలిన వారందరూ మార్గభ్రష్ఠులైన వారే. కనుక నా నుంచి మార్గదర్శకత్వం కోరుకొండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను తినిపించినానో, వారు తప్ప మిగిలిన వారందరూ ఆకలితో అలమటించే వారే. కనుక నా నుండి పోషణ కోరుకొండి, నేను మీకు పోషణనిస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను వస్త్రాలను తొడిగించానో, వారు తప్ప మిగిలిన వారందరూ వివస్త్రులే, కనుక నా నుండి వస్త్రాలను కోరండి, నేను మీకు వస్త్రాలనిస్తాను. ఓ నా దాసులారా! నిశ్చయంగా మీరు రాత్రుల యందు, పగటియందు పాపకార్యాలకు పాల్బడతారు మరియు నేను మీ పాపాలనన్నింటినీ క్షమిస్తాను. కనుక పాపక్షమాపణ కొరకు నన్ను అర్థించండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా! ఒకవేళ మీరు నాకు ఏదైనా హాని కలిగించ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ హాని కలిగించలేరు. అలాగే ఒకవేళ మీరు నాకు ఏదైనా మంచిని కలుగజేయ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ మంచిని కలుగజేయలేరు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత దైవభీతి గల హృదయం మాదిరి – అత్యంత దైవ భీతి గలవారిగా, అత్యంత పవిత్రులుగా మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ జోడించదు, ఏమీ ఉన్నతం చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత హీనమైన, నీచమైన, పాపిష్ఠి హృదయం మాదిరి – అత్యంత పాపిష్ఠులుగా, నీచులుగా, మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ నష్టము, హాని కలిగించదు, ఏమీ తక్కువ చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులు – ఒకవేళ అందరూ కలిసి ఒక మైదానంలో నిలబడి, నన్ను అర్థిస్తే, నేను అందరికీ వారు కోరుకున్నదంతా ప్రసాదించినా, అది నా ఖజానా నుంచి, సముద్రంలో ముంచిన సూది మొన సముద్రం నుండి ఎంత నీటిని తగ్గిస్తుందో, అంత కూడా తగ్గించదు. ఓ నా దాసులారా! నిశ్చయంగా, అవి మీ కర్మలు మాత్రమే, వాటి కొరకు మీరు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు. అపుడు నేను మీకు దాని పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాను. కనుక ఎవరైనా మంచిని, శుభాన్ని సాధించినట్లయితే అందుకు అల్లాహ్ ను ప్రస్తుతించాలి మరియు ఎవరైనా చెడుకు పాల్బడితే అందుకు మరెవ్వరినో కాకుండా తనను తాను నిందించుకోవాలి.