అబూ జుబైర్ రజియల్లాహు అన్హు సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ ఈ విధంగా అల్లాహ్ ను స్తుతించేవారు: “లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు...
ప్రతి ఫర్జ్ సలాహ్ ను (ప్రతి ఫర్జ్ నమాజును) సలాంతో ముగించిన తరువాత ప్రతిసారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఘనమైన ఈ స్తోత్రాన్ని పఠించే వారు; దాని అర...

అబూ జుబైర్ రజియల్లాహు అన్హు సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ ఈ విధంగా అల్లాహ్ ను స్తుతించేవారు: “లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”

అల్-ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు యొక్క లేఖకుడు వర్రాద్ ఉల్లేఖనం : “ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “ప్రతి ఫర్జ్ సలాహ్ (నమాజు) తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు” (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, విశ్వ సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్తోత్రములూ ఆయనకు చెందినవే, ఆయన సర్వసమస్తము పై ఆధిపత్యము, అధికారము కలవాడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించదలిచిన దానిని ఎవరూ ఆపలేరు, నీవు ఆపివేసిన దానిని ఎవరూ ప్రసాదించలేరు. ఐశ్వర్యవంతునికి అతనిసంపద, నీకు వ్యతిరేకంగా దేనికీ పనికిరాదు.)”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, ఆయన ఇలా పలికినారు: “ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”

అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.

అబ్దుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు.

అబీ ఖతాదా అస్’సలమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”

ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను మొలల వ్యాధితో బాధపడుతున్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను నా నమాజు గురించి ప్రశ్నించాను. దానికి వారు ఇలా అన్నారు.” “నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”

మహ్’మూద్ బిన్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి. వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).