వివరణ
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంపదలలోని రకాలను మరియు వాటిపై జకాతు చెల్లించని వారికి తీర్పుదినమున విధించబడే శిక్షలను గురించి తెలియజేసినారు. వాటిలో:
మొదటిది: బంగారం మరియు వెండి, ఇంకా వాటికి సారూప్యంగా ఉండేవి, డబ్బు మరియు వాణిజ్య వస్తువులు మొదలైనవి. ఈ సంపదలు జకాతుకు లోబడి ఉంటాయి, కానీ వాటి జకాతు చెల్లించబడదు. ఈ సంపదలపై జకాతు చెల్లించనట్లయితే పునరుత్థాన దినమున వాటిని కరిగించి, ప్లేట్ల (ఫలకాల) రూపంలో పోసి, నరకాగ్నిలో ఎర్రగా కాల్చి వాటితో, వాటి యజమానిని శిక్షించడం జరుగుతుంది. వాటితో అతని ప్రక్కల మీద, వీపు మీద మరియు నుదిటి మీద వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లబడినప్పుడల్లా, వాటిని మళ్లీ ఎర్రగా కాల్చడం జరుగుతుంది, ఆ విధంగా అతడు తీర్పు దినం అంతటా శిక్షించబడుతూనే ఉంటాడు. ఆ దినము యాభై వేల సంవత్సరాలంత దీర్ఘంగా ఉంటుంది, ఇలా అల్లాహ్ తన సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు జరుగుతుంది. తరువాత అతను స్వర్గం లేదా నరకాగ్నిలో నివసించేవారిలో ఒకనిగా మారుతాడు.
రెండవది: ఒంటెలు కలిగి ఉండి కూడా వాటి జకాత్ మరియు వాటి హక్కును చెల్లించని ఒంటెల యజమాని; వాటి హక్కులలో అక్కడ హాజరైన పేదలకు వాటి పాలు పితికి ఇవ్వడం కూడా ఒకటి. పునరుత్థాన దినమున ఈ ఒంటెలు మునుపెన్నడూ లేనంతగా పెద్దవిగా, లావుగా తీసుకు రాబడతాయి; మరియు విశాలమైన, చదునైన భూమిపై పునరుత్థాన దినాన వాటి యజమాని విసిరివేయబడతాడు. అవి అతనిని తమ కాళ్ళతో తొక్కుతాయి, మరియు పళ్ళతో కొరుకుతాయి. చివరి ఒంటె అతనిని దాటినప్పుడల్లా, మొదటిది ఒంటె వంతు వస్తుంది. అతను పునరుత్థాన దినం అంతటా ఈ విధంగా శిక్షించబడుతూనే ఉంటాడు, ఆ దినము వ్యవధి యాభై వేల సంవత్సరాలు ఉంటుంది, అల్లాహ్ సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు ఈ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. తరువాత అతడు స్వర్గజనులలోని వానిగానో లేదా నరకవాసులలోని వానిగానో మారిపోతాడు.
మూడవది: ఆవులు, మేకలు మరియు గొర్రెలు కలిగి ఉండి, వాటి జకాతును చెల్లించకుండా ఉన్న యజమాని. అతనికి సంబంధించి పునరుత్థాన దినమున ఆ ఆవులు, మేకలు మరియు గొర్రెలు వాటి అసలు సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో తీసుకు రాబడతాయి, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు. అతడిని నేలపై పడవేసి, చదునుగా ఉండే విశాలమైన మైదానంలో విసిరివేయడం జరుగుతుంది. ఆ ఆవులు, మేకలు మరియు గొర్రెలలో ఒక్కటి కూడా వంగిపోయిన కొమ్ములతో, లేక విరిగి పోయిన కొమ్ములతో లేక అసలు కొమ్ములు లేకుండా ఉండదు; అలాకాక అవి బలంగా, ఎటువంటి లోపము లేకుండా, సంపూర్ణంగా ఖచ్చితమైన ఆకృతిలో ఉంటాయి. అవి అతడిని తమ కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి, తమ కాళ్ళ గిట్టలతో అతడిని తొక్కుతూ ఉంటాయి. వాటిలో చివరి జంతువు అతడిని దాటిన తరువాత మొదటి దాని వంతు వస్తుంది. అతను పునరుత్థాన దినం అంతటా ఇదే స్థితిలో ఉంటాడు, ఈ విధంగా శిక్షించబడుతూనే ఉంటాడు, ఆ దినము వ్యవధి యాభై వేల సంవత్సరాలు ఉంటుంది, అల్లాహ్ సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు ఈ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. తరువాత అతడు స్వర్గజనులలోని వానిగానో లేదా నరకవాసులలోని వానిగానో మారిపోతాడు.
నాలుగవది: గుర్రాలు కలిగి ఉన్న యజమాని. ఇవి మూడు రకాలుగా ఉంటాయి:
మొదటిది: అవి అతనికి పునరుత్థాన దినమున భారంగా పరిణమిస్తాయి: ఒకవేళ వాటి యజమాని వాటిని ఇతరులకు తన డాబు, దర్పంగా చూపడానికి, హోదా మరియు గర్వము కొరకు; మరియు ఇస్లాం కు మరియు ముస్లిములకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించే ఉద్దేశ్యముతో వాటిని కట్టివేసి పెంచుతున్నట్లయితే పునరుత్థాన దినమున అవి అతనికి భారంగా పరిణమిస్తాయి.
రెండవది: అవి అతనికి ఒక కవచంలాగా పరిణమిస్తాయి: గుర్రాల యజమాని వాటిని అల్లాహ్ మార్గములో జిహాద్ కొరకు వినియోగించే ఉద్దేశ్యముతో వాటిని దయతో, కరుణతో పెంచుతూ, వాటిలోని మగ గుర్రాలను సంతానోత్పత్తికి కొరకు కూడా వినియోగించే వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి ఆ గుర్రాలు కవచంలాగా పరిణమిస్తాయి.
మూడవది: అవి అతనికి పుణ్యఫలంగా పరిణమిస్తాయి: గుర్రాల యజమాని వాటిని ముస్లిముల ప్రయోజనాల కొరకు, అల్లాహ్ మార్గములో జిహాద్ కొరకు వినియోగించే ఉద్దేశ్యముతో వాటిని ఉంచే వ్యక్తి. అతడు వాటి కొరకు పచ్చిక బయళ్ళను కేటాయించి, వాటిలో గుర్రాలను ఉంచి మేపుతాడు. అందులో ఆ గుర్రాలు ఏమి తిన్నా (ప్రతి గడ్డిపరక, ప్రతి ఆకు) అవి అన్నీ అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి, అవి వేసిన పేడ (లద్దీ) వాటి మూత్రము కూడా అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. అవి తమ ముకుతాళ్ళను త్రెంచుకోవు, ముకుతాళ్ళు అంటే, వాటిని కట్టివేసి ఉంచడానికి, అవి బయళ్ళలో, ఎత్తైన ప్రదేశాలలో పరుగెత్తేలా చేయడానికి ఉపయోగించే త్రాడు. అవి తిరుగుతూ, పరుగెడుతూ వేసిన ప్రతి డెక్కల గుర్తు (ప్రతి అడుగు యొక్క గుర్తు),అవి వేసిన పేడ, అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. ఒకవేళ అతడు ఆ గుర్రాన్ని ఏదైనా నది ఒడ్డు మీద నుండి తీసుకు వెళుతున్నపుడు, అతనికి (గుర్రానికి) నీళ్ళు తాపించే ఉద్దేశ్యం లేకపోయినా, గుర్రం తనంతతానే నదిలోని నీళ్ళు త్రాగితే, అది ఎన్ని గ్రుక్కల నీళ్ళు త్రాగిందొ అవన్నీ అతనికి పుణ్యఫలాలుగా వ్రాయబడతాయి.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గాడిదల గురించి ప్రశ్నించడం జరిగింది, వాటి విషయం కూడా గుర్రాల వంటిదేనా అని.
దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అన్ని రకాల విధేయత మరియు అవిధేయతలకు సాధారణంగా అన్వయించే ఈ ఆయతు మినహా ప్రత్యేకంగా వాటిని గురించి ప్రస్తావించే ఆదేశం / శాసనం ఏదీ అవతరించబడలేదు. ఆ ఆయతులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఫమన్ య’మల్ మిథ్’ఖాల జర్రతిన్ ఖైరైయ్యరహ్, వమన్ య’మల్ మిథ్’ఖాల జర్రతిన్ షర్రైయ్యరహ్” (అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు; మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు. (సూరహ్ అ'జ్-'జల్'జలహ్ (99: 7,8)”
కనుక ఎవరైతే గాడిదలను అల్లాహ్ యొక్క అవిధేయతకు పాల్బడే కార్యాలలో వినియోగిస్తాడో, అతడు దాని శిక్షను చూసుకుంటాడు, మరియు ఎవరైతే వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు పాల్బడే కార్యాలలో వాటిని ఉపయోగిస్తాడో అతడు కూడా దాని ప్రతిఫలాన్ని చూసుకుంటాడు.