హిత్తాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అర్’రఖాషీ ఉల్లేఖన: “నేను అబీ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) తో నమాజు ఆచరించాను. ఆయన తషహ్హుద్ లో ఉండగా, అక్కడున్న(నమాజు చదువుతున్న) వారిలో ఒకరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” (“నమాజు, ధర్మబధ్ధత మరియు జకాతులతో పాటు స్థాపించబడినది”) అన్నారు. అబీ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు సలాముతో నమాజును ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీలో ఎవరు అలా అన్నది?” అని ప్రశ్నించారు. ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. ఆయన మళ్ళీ ప్రశ్నించారు “మీలో ఎవరు అలా అన్నది?” అని. తిరిగి ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. అపుడు ఆయన “ఓ హిత్తాన్! బహుశా నీవే అలా అని ఉంటావు” అన్నారు. దానికి హిత్తాన్ “లేదు, నేను అనలేదు. మీరు కోపగిస్తారేమో అని నేను మౌనంగా ఉన్నాను” అన్నాడు. అపుడు ప్రజలలో నుండి ఒకరు “అలా అన్నది నేనే, అయితే నేను మంచి ఉద్దేశ్యముతోనే అలా అన్నాను” అన్నాడు. అపుడు అబీ మూసా ఇలా అన్నారు: “నమాజులో ఏమి పలకాలో తెలియదా నీకు? నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు, మరియు మాకు సున్నతును వివరించారు. మరియు నమాజులను ఆచరించమని బోధించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి. ఎపుడైతే అతడు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” (సూరహ్ అల్ ఫాతిహా: 7వ ఆయతు) అని పఠిస్తాడో, మీరు ‘ఆమీన్’ అనండి, అల్లాహ్ మీ ప్రార్థనకు స్పందిస్తాడు. ఇమాం తక్బీర్ పలికితేనే, మీరు కూడా తక్బీర్ పలుకండి, ఎందుకంటే అతడు మీ కంటే ముందుగా రుకూ చేస్తాడు, మరియు రుకూ నుండి మీ కంటే ముందుగా పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఇది దానికి సమానం అవుతుంది (మీరు అలా చేయడం ఇమాం చేసిన దానికి సమానం అవుతుంది). ఇమాం “సమి’అల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని వింటాడు (తనను కీర్తించిన వాని దుఆను వింటాడు) అని పలికితే, మీరు “అల్లాహుమ్మా, రబ్బనా లకల్ హంద్” (ఓ అల్లాహ్, మా ప్రభూ, పొగడ్తలు, కీర్తనలు అన్నీ నీ కొరకే) అని పలకండి – అల్లాహ్ మిమ్మల్ని (మీ దుఆలను) వింటాడు. ఎందుకంటే అల్లాహ్ తన సందేశహరుని నాలుక ద్వారా పలికించాడు – అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) వింటాడు అని. అతడు (ఇమాం) తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే మీరు కూడా తక్బీర్ పలికి సజ్దహ్ చేయండి. అతడు మీకంటే ముందే సజ్దహ్ చేస్తాడు మరియు మీ కంటే ముందే సజ్దహ్ నుండి పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(మీరు) అలా చేయడం, దానికి (అతడు చేసిన దానికి) సమానం అవుతుంది. అతడు ‘తషహ్హుద్’ కొరకు కూర్చొంటే, మీ అందరిలో ప్రతి ఒక్కరి నోట ముందుగా రావాల్సిన మాటలు ఇవే అయి ఉండాలి: “అత్తహియ్యాతు, అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్, అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”