- ఈ హదీథులో ఐదు రకాల వస్తువులు పేర్కొనబడినాయి: అవి, బంగారం, వెండి, గోధుమలు, బార్లీ మరియు ఖర్జూరాలు. విక్రయం ఒకే రకమైన వస్తువులను కలిగి ఉన్నట్లయితే, ఆ విక్రయ వ్యవహారం చెల్లుబాటు కావడానికి రెండు షరతులు పూర్తి చేయవలసి ఉంటుంది. మొదటిది ఆ విక్రయం - బేరం కుదిరిన వెంటనే, అక్కడికక్కడే, అప్పటికప్పుడే జరగాలి, మరియు రెండవది - విక్రయించబడిన వస్తువుల బరువులు సమానంగా ఉండాలి. ఉదాహరణకు బంగారానికి బదులుగా బంగారం. అవి సమానంగా లేకపోతే అది ‘రిబా అల్ ఫద్ల్’ (మిగులు వడ్డీ) వ్యవహారం అవుతుంది. మరోవైపు, అమ్మక వ్యవహారం వివిధరకాల వస్తువుల మధ్య ఉన్నట్లయితే; అంటే ఉదాహరణకు గోధుమలకు బదులుగా వెండిని (నాణాల రూపంలోగానీ లేక మరో రూపంలో గానీ) ఇవ్వడం; ఇటువంటి అమ్మకం వ్యవహారం చెల్లిబాటు కావడానికి ఒక షరతు తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంటుంది – అది బేరం కుదుర్చుకున్న ధరను అప్పటికప్పుడే, అక్కడికక్కడే చెల్లించాలి; లేకుంటే అది ‘రిబా అన్’నసీఅహ్’ (వాయిదా చెల్లింపు వడ్డీ) అవుతుంది.
- “మజ్లిస్ అల్ అఖద్” (ఒప్పంద సమావేశం): అంటే అమ్మకం జరిగే ప్రదేశాన్ని సూచిస్తుంది. రెండు పక్షాలు కూర్చుని ఒప్పందం చేసుకున్నా, లేక నడుస్తూ ఒప్పందం చేసుకున్నా లేక గుర్రాలపై స్వారీ చేస్తూ ఒప్పందం చేసుకున్నా అది ‘మజ్లిస్ అల్ అఖద్’ అనబడుతుంది. మరియు ‘విడిపోవుట’ అంటే, సాధారణంగా ‘ఒప్పంద సమావేశం ముగిసింది’ అని ప్రజలలో బాగా వాడుకలో ఉన్న విధానాన్ని సూచిస్తుంది.
- హదీథులో ఉన్న నిషేధము బంగారము ఏ రూపంలో ఉన్నా వర్తిస్తుంది, అంటే బంగారము నాణెముల రూపములో ఉన్నా, లేక నాణెముల రూపములో లేకపోయినా వర్తిస్తుంది; అలాగే వెండి ఏ రూపంలో ఉన్నా వర్తిస్తుంది, అంటే వెండి నాణెముల రూపములో ఉన్నా, లేక నాణెముల రూపములో లేకపోయినా వర్తిస్తుంది.
- బంగారము మరియు వెండి విక్రయంలో ఏఏ విషయాలు, సూత్రాలు వర్తిస్తాయో, అవే ఈ రోజుల్లో చలామణిలో ఉన్న ద్రవ్యానికి (ఈరోజుల్లో ఉపయోగములో ఉన్న నాణెములు, కరెన్సీ, ధనము, డబ్బు మొ.) కూడా వర్తిస్తాయి. అంటే, ఒక దేశపు కరెన్సీని మరోదేశపు కరెన్సీతో మారకం చేయవలసి వచ్చినపుడు, ఉదాహరణకు: రియాల్’లకు బదులుగా దిర్హంలను తీసుకోవలసి వచ్చినపుడు, లేక డాలర్లకు బదులుగా రూపాయలు తీసుకోవలసి వచ్చినపుడు, వాటి విలువలో ఉన్న వ్యత్యాసం విషయంలో రెండు పక్షాలు ఒక అంగీరానికి వచ్చి మారకం చేసుకోవచ్చు. అయితే ఆ మారకం అనేది అదే సమావేశంలో అక్కడికక్కడే జరగాలి. అలా కాకుంటే ఆ లావాదేవీ చెల్లుబడి కాదు. అది వడ్డీ ఆధారిత లావాదేవీ అవుతుంది, మరియు అది హరాం.
- వడ్డీ ఆధారిత లావాదేవీలకు, బేరసారాలు అనుమతి లేదు. అటువంటి ఒప్పందాలు, ఒడంబడికలు చెల్లవు – ఇరుపక్షాలు ఆ విధమైన ఒప్పందాలు, ఒడంబడికలు తమ ఇష్టపూర్వకంగా చేసుకున్నప్పటికీ. ఎందుకంటే ఇస్లాం వ్యక్తుల హక్కులను, మరియు సమాజం యొక్క హక్కులను పరిరక్షిస్తుంది – అతడు తన హక్కులను వదిలివేసుకున్నప్పటికీ.
- ఎవరైతే చెడును, కీడును, హానిని నిషేధించగల స్థాయి, సమర్థత, లేక వాటిని నిరోధించగల స్థాయి, స్థోమత కలిగి ఉంటారో, వారు అలా తప్పనిసరిగా చేయాలి.
- ఏదైనా విషయాన్ని ఖండిస్తున్నట్లయితే, దానికి తగిన ఋజువును కూడా చూపాలి, లేదా ప్రస్తావించాలి, ఏవిధంగానైతే ఈ హదీథులో ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ చేసినారో.