/ “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది...

“ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది...

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది.” ముత్తఫఖున్ అలైహి. మరియు సహీహ్ ముస్లింలో ఇలా ఉంది: “ఎవరైనా మన ఈ విషయానికి (ఇస్లాం కు, షరియత్’కు) అనుగుణంగా లేని పనిని చేసినట్లయితే అది తిరస్కరించబడుతుంది.”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.

Hadeeth benefits

  1. ఇస్లాంలో ఏ ఆరాధనైనా (ఇబాదత్ ఐనా) ఖుర్’ఆన్ మరియు సున్నత్’లో పేర్కొనబడిన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనం సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఆయన ఆదేశించిన విధంగానే ఆరాధిస్తాము. అంతే గానీ, ఖుర్’ఆన్ మరియు సున్నత్ లలో పేర్కొనబడని విధంగా లేదా కొత్తగా సృష్టించబడిన కల్పిత ఆరాధనల ద్వారా ఆయనను ఆరాధించము.
  2. ధర్మము (ఇస్లాం) "అభిప్రాయాలపై మరియు ‘ఈ విధంగా ఆరాధించడం మంచిది’ అని లేదా ‘ఈ పద్ధతిలో ఆరాధించడం కూడా సరైనదే’ అని భావించడం" మొదలైన వాటిపై ఆధారపడి ఉండదు. ధర్మము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
  3. ఇస్లాం ధర్మం పరిపూర్ణమైన ధర్మమని ఈ హదీథు నిరూపిస్తున్నది (పరిపూర్ణమైన దానిలోనికి మరింకే కొత్త విషయం లేక విధానం యొక్క అవసరం ఉండదు).
  4. “బిద్’అత్” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో గానీ లేక ఆయన సహాబాల కాలములో గానీ ఇస్లాం లో లేని విషయమూ, ఆ తరువాత అందులోనికి కొత్తగా ప్రవేశపెట్టబడిన ప్రతి విషయమూ “బిద్’అత్” అనబడుతుంది; అది విశ్వాసానికి సంబంధించిన కొత్త విషయం గానీ, లేక ధర్మానికి సంబంధించి కొత్త పలుకులు, మాటలు, పదాలు గానీ, లేక కొత్త ఆచరణలు గానీ.
  5. ఈ హదీసు ఇస్లాం యొక్క మూలస్థంభాల వంటి నియమాలలో ఒకటి – అది ఇస్లాం లో ఆచరణలకు సంబంధించి ఒక త్రాసు (మీజాన్) వంటిది. ఏ ఆచరణైనా అది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, మరియు ఆయన సామీప్యము పొందుట కొరకు మాత్రమే సంకల్పించబడినదై ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఆచరించిన వానికి దాని పుణ్యఫలములో ఏమీ లభించదు. అదే విధంగా ఏ ఆచరణైనా అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానానికి అనుగుణంగా ఉండాలి. అలా కాకపోయినట్లయితే అది ఆచరించిన వాని పైనే త్రిప్పి కొట్టబడుతుంది అంటే తిరస్కరించబడుతుంది.
  6. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే – కొత్త విషయాలు నిషేధము అంటే, అది ధర్మానికి చెందిన కొత్త విషయాలు అని. అంతే కాని ఈ ప్రపంచానికి సంబంధించిన కొత్త విషయాలు నిషేధము అని కాదు అర్థము.