వివరణ
ఈ ‘హదీసుల్ ఖుద్సీ’ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా అన్నాడని తెలియజేస్తున్నారు: ఎవరైతే నా ఔలియాలలో ఏ వలీనైనా (వలీ: దైవభీతిపరుడు, ధర్మనిష్ఠాపరుడు అయిన అల్లాహ్ యొక్క దాసుడు; ‘వలీ’ ఏక వచనం, ‘ఔలియా’ బహువచనం –) బాధపెడతారో, అవమానించారో మరియు ద్వేషిస్తారో, నేను అతని పట్ల శత్రుత్వాన్ని ప్రకటిస్తున్నాను.
వలీ: అంటే, దైవభీతి కలిగిన, ధర్మనిష్టాపరుడైన, అల్లాహ్’కు ఇష్ఠుడైన ఒక విశ్వాసి: ‘విలాయహ్’ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. ఇక్కడ ‘విలాయహ్’ అంటే అటువంటి దాసుని స్థితి, స్థానము. అల్లాహ్ పై అతని విశ్వాసము, దైవభక్తి మరియు అతని ధర్మనిష్ఠల యొక్క స్థాయిపై అతనిపట్ల అల్లాహ్ యొక్క ‘విలాయహ్’ ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాసి, తన ప్రభువు తనపై విధిగావించిన విషయాలను ఆచరించడం ద్వారా తప్ప మరింకే విషయం ద్వారా కూడా తన ప్రభువుకు చేరువ కాలేడు, ఉదాహరణకు: ఆయనకు విధేయత చూపే (ఆయన ఆదేశించిన) ఆచరణలను ఆచరించడం, మరియు ఆయన హరాం చేసిన (నిషేధించిన) విషయాలను వదలి వేయడం మొదలైనవి. అయితే విధిగా ఆచరించవలసిన విషయాలతో పాటు, స్వచ్చందంగా ఆచరించే అదనపు ఆరాధనల ద్వారా అతడు తన ప్రభువుకు మరింత చేరువ అవుతూ ఉంటాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ప్రేమను పొందుతాడు. మరి అల్లాహ్ అతడిని ప్రేమించినట్లయితే, అల్లాహ్ అతనికి ఈ క్రింద పేర్కొనబడిన నాలుగు (శరీర) భాగాలను సరైన మార్గనిర్దేశం ఇవ్వడం ద్వారా అతనికి సహాయపడతాడు.
అల్లాహ్ అతని వినికిడిలో అతనికి సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్‌కు నచ్చినది తప్ప మరేమీ వినడు.
అల్లాహ్ అతని కళ్ళకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్ ఇష్టపడే వాటిని మరియు ఆయనకు నచ్చిన వాటిని తప్ప మరేమీ చూడడు.
అల్లాహ్ అతని చేతులను సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు,అందువలన అతను అల్లాహ్‌కు ఇష్టమైనది తప్ప తన చేతితో ఏమీ చేయడు.
అల్లాహ్ అతని పాదాలను సరిగా మార్గనిర్దేశం చేస్తాడు. అందువలన అతడు అల్లాహ్ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ, మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటాడు.
వీటన్నింటితో పాటు, అతను అల్లాహ్’ను ఏదైనా అడిగితే, ఆయన అతని అభ్యర్థనను అతనికి ప్రసాదిస్తాడు మరియు అతని ప్రార్థనకు సమాధానం లభిస్తుంది; మరియు అతను అల్లాహ్‌ను ఆశ్రయించి, రక్షణ కోరుతూ ఆయనను ఆశ్రయిస్తే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనికి అతను భయపడే వాటి నుండి ఆశ్రయం మరియు రక్షణను ప్రసాదిస్తాడు.
ఇంకా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: అతనిపై నా యొక్క దయ, కరుణ కారణంగా – ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అందులో ఉన్న కష్టం మరియు బాధ కారణంగా అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు విశ్వాసిని బాధపెట్టే వాటిని అల్లాహ్ ఇష్టపడడు.