/ “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది...

“మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది...

అబూ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా అడిగారు: “సర్వలోకాల సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వద్ద - మీ ఆచరణలలో అత్యంత ఉత్తమమైనది, మహా గౌరవనీయమైనది, పుణ్యఫలమును అత్యంత ఎక్కువగా వృద్ధి చెందించునది; పరిశుద్ధమైనది, మరియు కల్మశం లేనిది అయిన ఆచరణ ఏమిటో మీకు తెలుపనా (మీకు బోధించనా)?” (మీకు తెలుపనా) స్వర్గములో మీ స్థానాలను ఉన్నతం చేసే ఆచరణ ఏమిటో? (మీకు తెలుపనా) బంగారము మరియు వెండి దానము చేయుట కంటే ఉత్తమ ఆచరణ ఏమిటో? మరియు (మీకు తెలుపనా) యుద్ధభూమిలో అవిశ్వాసులను ఎదుర్కొన్నపుడు మీరు వారి మెడలు నరకడం లేక వారు మీ మెడలు నరకడం కంటే ఉత్తమ ఆచరణ ఏమిటో? అది విని సహాబాలు “తప్పనిసరిగా చెప్పండి, ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అన్ని వేళలలో, అన్ని విధానాలలో, అన్ని పరిస్థితులలో అల్లాహ్ యొక్క ధ్యానం చేయుట, ఆయనను స్మరించుట (అల్లాహ్ యొక్క జిక్ర్ చేయుట)” అన్నారు.

Hadeeth benefits

  1. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను బహిర్గతంగా మరియు అంతర్గతంగా, నిలకడగా, నిరంతరం స్మరించడం ఆరాధనకు సంబంధించి గొప్ప ఆచరణలలో ఒకటి, మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ వద్ద అత్యంత ప్రయోజనకరమైనది.
  2. (షరియత్ లో ఆదేశించబడిన) ఆచరణలు అన్నీ సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణను స్థాపించడానికే నిర్దేశించ బడ్డాయి. దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: “వ అఖీమిస్సలాత లిజిక్రీ” (నన్ను స్మరించడానికి సలాహ్ నెలకొల్పు) (సూరహ్ తాహా 20:14). మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం, సఫా మరియు మర్వా గుట్టల మధ్య నడవడం (సయీ చేయడం), జమారాత్ లపై గులకరాళ్ళు విసరడం – ఇవన్నీ సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకే” (అబూ దావూద్ మరియు తిర్మిజీ)
  3. అల్ ఇజ్జ్ ఇబ్నె అబ్దుస్సలాం రహిమహుల్లాహ్ తన “ఖవాయిద్” గ్రంథములో ఇలా అన్నారు: మనం ఆచరించిన ఆరాధనలన్నింటిలో మనం ఎంతగా శ్రమ పడినామో దాని ఆధారంగా పుణ్యఫలం ఉండదు అనడానికి ఈ హదీథు ఒక ఉదాహరణ. అలా గాక, సర్వోన్నతుడైన అల్లాహ్ కొద్దిపాటి ఆచరణలకు కూడా, ఎక్కువగా ఆచరించిన వాటి కంటే కూడా అధికంగా ప్రసాదిస్తాడు. కనుక ప్రతిఫలం ఆచరణల స్థాయి మరియు ఘనతల వ్యత్యాసాలపై ఆధారపడి ఉంటుంది.
  4. అల్-మనావీ రహిమహుల్లాహ్ ‘ఫైద్ అల్ ఖదీర్’ గ్రంథములో ఇలా అంటున్నారు: ఈ హదీథును ఈ క్రింది విషయాల ఆధారంగా అర్థం చేసుకోవాలి. అల్లాహ్ యొక్క స్మరణను గురించి (ఆయన జిక్ర్ చేయుట గురించి) ఎవరిని సంబోధించి చెప్పబడుతున్నదో, ఆ ఆచరణ వారి కొరకు ఉత్తమమైనది; మరియు యుద్ధంలో ఇస్లాంకు ప్రయోజనం కలిగించిన ధైర్యవంతుడు మరియు శౌర్యవంతుడిని సంబోధిస్తున్నట్లయితే అతనికి ‘జిహాద్’ ఉత్తమం అని చెప్పబడుతుంది; లేదా పేదలకు ప్రయోజనం చేకూర్చే ధనవంతుని సంబోధించినట్లయితే అతనికి ఇలా చెప్పబడుతుంది - ‘దాతృత్వం’ అన్నింటి కంటే ఉత్తమమైనది; అలాగే హజ్ చేయగల అర్హత, సమర్థత, సామర్థ్యము ఉన్న వ్యక్తికి ‘హజ్జ్’ చేయుట అన్నింటి కంటే ఉత్తమమైనది అని చెప్పబడుతుంది; మరియు ఎవరి తల్లిదండ్రులైతే సజీవంగా ఉన్నారో వారికి ‘తల్లిదండ్రుల సేవ చేయుట, వారిపట్ల బాధ్యులై ఉండుట’ అన్నింటి కంటే ఉత్తమం అని చెప్పబడుతుంది. ఆ విధంగా ఒకే విషయానికి సంబంధించిన వేర్వేరు హదీసుల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.
  5. అల్లాహ్ యొక్క స్మరణ చేయుట, స్తుతించుట అనేది – నాలుక ఏమి ఉచ్ఛరిస్తున్నదో దానిపై హృదయం యొక్క చింతన మరియు అవగాహనతో పూర్తవుతుంది; తరువాత కేవలం హృదయంలో ఏమి ఉన్నదో, ఉదాహరణకు దైవ చింతన; తరువాత కేవలం నాలుక ద్వారా ఏమి ఉచ్ఛరించబడుతున్నదో అది - ఇలా ప్రతి దానిలోనూ ఒక ప్రతిఫలం ఉంది, ఇన్-షా-అల్లాహ్ (అల్లాహ్ కు ఇష్టమైనట్లయితే).
  6. ఉదయం మరియు సాయంత్ర సమయాలలో చేయవలసిన స్మరణలు (అజ్’కార్), మస్జిదు, ఇల్లు మరియు టాయిలెట్‌లోకి ప్రవేశించే సమయాన మరియు బయటకు వచ్చే సమయాన చేయవలసిన స్మరణల పట్ల ఒక ముస్లిం యొక్క నిబద్ధత మరియు ఆసక్తి మొదలైనవి అల్లాహ్’ను తరచుగా మరియు ఎక్కువగా స్మరించుకునేవారిలో ఒకరిగా చేస్తుంది.