- ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది షరియత్’లో ఒక నిరంతర నియమం - గౌరవాస్పదమైన వాటికి తగిన గౌరవాన్నివ్వడం. కుడి వైపునుండి మొదలు పెట్టడం కూడా అటువంటిదే; ఉదాహరణకు: వస్త్రధారణ చేయునపుడు (చొక్కా, పాంటు, పాజామా మొ. తొడుగునపుడు); పాదరక్షలు తొడుగునపుడు; మస్జిదులోనికి ప్రవేశించునపుడు, పంటి పుల్ల (మిస్వాక్) ఉపయోగించునపుడు, కళ్ళకు ‘కొహ్ల్’ (సుర్మా, కాటుక మొ.) ఉపయోగించునపుడు; కాలి మరియు వేలి గోళ్ళు తీయవలసి వచ్చినపుడు; మీసములు కత్తిరించునపుడు; తలవెంట్రుకలు దువ్వునపుడు; చంకలలోని వెంట్రుకలను తొలగించునపుడు; తలవెంట్రుకలను గొరుగునపుడు (గుండు కొట్టించునపుడు); నమాజు ముగింపుకు ముందు సలాం చెప్పునపుడు; ఉదూలో శుభ్రపరుచుకొనవలసిన అవయవాలను కడుగునపుడు; మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చునపుడు; తినుట, త్రాగుట, కరచాలనము చేయుట, మరియు హజ్, ఉమ్రాలలో ‘హజ్రె అస్వద్’ రాతిని తాకుట మొదలైన పనులలో; అలాగే ఇదే కోవకు చెందిన ఇతర పనులను కుడి వైపునుండి ప్రారంభించుట అభిలషణీయము. పైన పేర్కొన్న వాటికి విరుద్ధమైన పనులకు, అంటే ఉదాహరణకు: మరుగుదొడ్డి లోనికి ప్రవేశించుట; మస్జిదు నుండి బయటకు వచ్చుట; కాలకృత్యములు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకొనుట; వొంటిపై తొడిగి ఉన్న వస్త్రాలను (చొక్కా, థోబు, పాంటు, పాజామా మొ.) తీయుట; పాదరక్షలను తొలగించుట మొదలైన ఇదే కోవకు చెందిన పనుల కొరకు ఎడమ చేతిని ఉపయోగించుట, ఎడమ వైపునుండి మొదలుపెట్టుట సిఫారసు చేయబడినది. ఇదంతా (షరియత్’లో) కుడి చేతికి, కుడి పార్శ్వానికి ఉన్న గౌరవం మరియు ఘనత కారణంగానే.
- “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుడి వైపునుండి మొదలు పెట్టుటకు ప్రాధాన్యతను ఇచ్చేవారు” అంటే దాని అర్థము: (గౌరవాస్పదమైన పనులను) కుడి చేతితో, లేక కుడి వైపునుండి ప్రారంభించుట; కుడి కాలితో ప్రారంభించుట మొదలైనవి, అలాగే వ్యవహారాలను కుడి పార్శ్వము నుండి నిర్వహించుట మొదలైనవి అన్నీ ఈ అర్థములోనికే వస్తాయి.
- ఇమాం అన్’నవవీ ఇలా అన్నారు: ఉదూలో కడుగవలసిన కొన్ని భాగాలను కుడి వైపు నుండి కడుగుట ప్రారంభించుట అభిలషణీయం కాదు (ఈ భాగాలకు కుడి వైపు నుండి మొదలుపెట్టాలి అనే నియమం వర్తించదు). ఉదాహరణకు: చెవులు, అరచేతులు, చెంపలు – ఈ భాగాలు రెండూ కలిపి ఒకేసారి కడుగబడతాయి. ఒకవేళ అలా రెండింటినీ ఒకేసారి కడుగుట సాధ్యం కాకపోతే, అంటే ఉదాహరణకు ఒక చేయి మాత్రమే కలిగి ఉన్న వ్యక్తి, లేక అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే – అతడు ముందుగా కుడి భాగాన్ని కడగాలి.