వివరణ
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారని, ఆయన తల వెంట్రుకలు నిగనిగలాడుతూ అతి నల్లగా ఉన్నాయని, సుదూర ప్రయాణికుడు అనడానికి అతనిలో అలసట, వొంటిపై దుమ్ము, చెదిరిన వెంట్రుకలు, బట్టలపై ధూళి వంటి చాయలేవీ లేవు అని అతడి రూపురేఖలను గురించి వివరించినారు. తామందరూ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నామని, తమలో ఎవరూ అతడిని ఎరుగరు అని అన్నారు. అతడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటి నుంచో ఎరిగిన వానిలా, ఆయన ముందు కూర్చుని ఇస్లాం ను గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’, సలాహ్ ను స్థాపించుట, జకాతు చెల్లించుట, రమజాన్ నెల ఉపవాసములు మరియు స్థోమత కలిగి ఉంటే హజ్ చేయుట మొదలైన వాటితో కూడిన ఇస్లాం మూల స్తంభములను గురించి చెప్పినారు.
ఆ ప్రశ్నించిన వ్యక్తి “నీవు సత్యము చెప్పినావు” అన్నాడు. సహబాలందరూ ఆశ్చర్య పోయినారు – పైకి ఏమీ ఎరుగని వాడిలా ప్రశ్నిస్తాడు, తరువాత దానిని ధృవీకరిస్తాడు – అని.
తరువాత అతడు ఈమాన్ గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ యొక్క ఆరు మూల స్తంభములను గురించి వివరించినారు. అందులో అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించుట, ఆయన గుణగణములను విశ్వసించుట, ఆయన కార్యములలో ఆయన ఏకైకుడని (ఆయనకు సాటి, సహాయకులు ఎవరూ లేరని) విశ్వసించుట, ఉదాహరణకు సృష్టి; ఆరాధనలు అన్నింటికీ ఆయన మాత్రమే ఏకైక అర్హుడని విశ్వసించుట. మరియు దైవదూతలను అల్లాహ్ కాంతితో సృష్టించినాడని, వారు అల్లాహ్ యొక్క గౌరవనీయులైన దాసులని, ఎప్పుడూ అల్లాహ్ పట్ల అవిధేయులు కారు అని, అల్లాహ్ యొక్క ఆఙ్ఞలకు అనుగుణంగా ఆచరిస్తారని విశ్వసించుట, అల్లాహ్ తరఫు నుండి ఆయన సందేశహరులపై అవతరింప జేయబడిన గ్రంథములను విశ్వసించుట, ఉదాహరణకు ఖుర్’ఆన్, తౌరాత్ మరియు ఇంజీలు మొదలైనవి, మరియు ఆయన సందేశహరులను విశ్వసించుట, ఎవరైతే అల్లాహ్ తరఫున ఆయన ధర్మాన్ని వ్యాపింప జేసినారో; వారిలో నూహ్, మూసా మరియు ఈసా అలైహిముస్సలాం మొదలైన మిగతా సందేశహరులు, ప్రవక్తలు ఉన్నారని, వారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లహ్ యొక్క చిట్టచివరి సందేశహరుడు అని విశ్వసించుట మరియు అంతిమ దినము నందు విశ్వసించుట – ఇందులో మరణానంతరం సమాధి నుండి మొదలుకుని ‘అల్ బర్జఖ్’ యొక్క జీవితం వరకు (మరణానికీ తీర్పు దినమునకు మధ్య ఉండే సంధి కాలపు జీవితం), మరియు మనిషి మరణానంతరం తిరిగి లేప బడతాడు అని, అతడి ఆచరణల లెక్క తీసుకో బడుతుంది అని, చివరికి అతడి అంతిమ నివాస స్థానము స్వర్గము గానీ లేక నరకము గానీ అవుతుంది అని విశ్వసించుట, తన అనంతమైన ఙ్ఞానము, వివేకముల ఆధారంగా అల్లాహ్ (ప్రళయ దినము వరకు) జరుగబోయే ప్రతి విషయాన్ని గురించి ముందుగానే రాసి ఉంచినాడని, జరిగే ప్రతి విషయమూ, అది ఎందుకొరకు సృష్టించబడినదో ఆ లక్ష్యము కొరకు జరుగుతుందని మరియు ఆయన ముందుగానే రాసి ఉంచిన దాని ప్రకారమే జరుగుతుందని విశ్వసించుట. తరువాత ఆవ్యక్తి ‘అల్ ఇహ్’సాన్’ ని గురించి తెలుపమని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – అల్ ఇహ్’సాన్ అంటే అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తూ ఉన్నట్లుగా ఆయనను ఆరాధించుట. ఆరాధనలో ఆ స్థాయిని చేరుకోలేక పోయినట్లయితే, అల్లాహ్ తనను చూస్తున్నాడని గ్రహించుట. వీటిలో మొదటిది (అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించుట) అత్యుత్తమ స్థాయి, రెండవ స్థాయి అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే , స్పృహ కలిగి ఉండుట.
తరువాత అతడు ‘ప్రళయ ఘడియ ఎపుడు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రళయ ఘడియకు చెందిన ఙ్ఞానమును అల్లాహ్ తన ఙ్ఞానములో భద్రపరిచి ఉంచాడు. కనుక సృష్టితాలలో ఎవరూ దానిని గురించి ఎరుగరు, చివరికి ప్రశ్నించ బడుతున్నవాడు మరియు ప్రశ్నించే వాడు కూడా” అని వివరించారు.
తరువాత అతడు ‘కనీసం ప్రళయ ఘడియ సంకేతాలైనా చెప్పమని’ అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఉంపుడు గత్తెలు విపరీతంగా పెరిగి పోవడం, ఆ కారణంగా వారి సంతానం పెరిగి పోవడం, లేదా తల్లుల పట్ల సంతానం యొక్క అవిధేయత విపరీతంగా పెరిగిపోవడం, వారు తమ సేవకులు, బానిసలు అన్నట్లుగా వ్యవహరించడం, అలాగే యుగాంతము సమీపిస్తున్న కాలములో పశువుల కాపరులకు, నిరుపేదలకు సైతము ఈ ప్రపంచ సుఖాలను సాధించుట తేలికై పోతుంది, వారు పెద్దపెద్ద భవనాలను నిర్మించడంలో ఆర్భాటము, అట్టహాసము ప్రదర్శిస్తుంటారు – అని వీటిని ‘ప్రళయ ఘడియ’ సమీపిస్తున్నది అనడానికి కొన్ని సంకేతాలుగా వివరించినారు.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నలు అడిగిన ఆ వ్యక్తి జిబ్రయీల్ అలైహిస్సలాం అని, సహబాలకు ఈ ‘దీన్ అల్ హనీఫా’ (స్వచ్ఛమైన ధర్మము) ను గురించి తెలియజేయడానికి వచ్చినారు అని తెలియ జేసినారు.